Hyderabad: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 6:44 AM ISTHyderabad: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమించానంటూ వెంటపడి వేధిస్తున్నారు. ఇష్టం లేదని చెప్పినా వినకుండా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. చివరకు తిరిగి ప్రేమించడం లేదని కోపంతో దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న యువతిపై రాజు అనే యువకుడు కన్నేశాడు. ఆమె స్కూల్ టీచర్ గా పని చేస్తుంది. రాజు ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. సదురు యువతి స్కూల్ కి వెళ్తున్న సమయంలో తనను ప్రేమించాలంటూ రాజు రోజూ వెంటపడే వాడు. అతని ప్రేమను యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన రాజు తనను ప్రేమించడం లేదని ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ఎప్పటిలానే ఆమె స్కూల్ నుంచి వస్తున్న సమయంలో దారిలో కాపు కాశాడు. ఆమె అటుగా రాగానే తాను వెంటనే తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో సదురు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో దాడి చేస్తుండగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. బాధితురాలికి మెడ భాగంలో తీవ్ర గాయం అయ్యింది.
కాగా.. యువతిపై కత్తితో దాడి చేసిన తర్వాత రాజు కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే.. అతను కత్తితో పొడుకోవడం గమనించిన స్థానికులు అతన్ని కూడా అడ్డుకున్నారు. గాయాలు అయిన ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.