Hyderabad: అక్క, తమ్ముడిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు.

By Srikanth Gundamalla  Published on  3 Sept 2023 5:31 PM IST
Hyderabad, Crime, Man Attack,  Girl Friend,

Hyderabad: అక్క, తమ్ముడిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమించానిన చెప్పి వెంట తిరిగి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక వేళ ఒప్పుకోకపోతే అవతలి వారి ప్రాణాలు తీసి.. తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే.. ఎల్బీనగర్లో ఓ ప్రేమోన్మాది తాను ప్రేమించిన యువతితో పాటు ఆమె తమ్ముడిపై దారుణంగా కత్తితో దాడి చేశారు. గమనించిన స్థానికులు నిందితుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో.. ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. చివరకు పోలీసులు వచ్చి ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

రాచకొండ కమిషనర్ పరిధిలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్ కు చెందిన అక్క, తమ్ముడు ఇద్దరూ ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. యువతి హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతున్నది. తమ్ముడు పృథ్వి (చింటూ) బీటెక్ పూర్తి చేసుకొని జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా యువతికి శివకుమార్ అనే వ్యక్తి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. పెళ్లి విషయం మాట్లాడేందుకు శివకుమార్ యువతి ఇంటికి వెళ్లాడు. తాను సిద్ధంగా లేనని చెప్పినా వినకుండా పెళ్లి కోసం శివకుమార్ ఒత్తిడి చేశాడు. ఆమె వద్దని చెప్పి నిరాకరించడంతో శివ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో.. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో యువతి తమ్ముడు కూడా ఉన్నాడు.

ఉన్నట్లుండి శివ తనతో పాటు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన యువతి తమ్ముడు పృథ్వి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో.. శివ ఇద్దరిపైనా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అక్కా, తమ్ముడు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగు తీశారు. ఇద్దరినీ గమనించిన స్థానికులు ఏమైందని అడగ్గా.. విషయం చెప్పారు. దాంతో.. ఆగ్రహంతో స్థానికులు కర్రలు తీసుకుని శివకుమార్‌పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. వారిని గమనించిన ప్రేమోన్మాది ఇంట్లో లాక్‌ చేసుకుని ఉండిపోయాడు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులను అదుపు చేసి.. నిందితుడి ముఖానికి ముసుగు వేసి కారులో తరలించారు. ప్రేమోన్మాది దాడిలో అక్క, తమ్ముడు ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తమ్ముడు చెందగా.. బాధిత యువతి చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story