హైదరాబాద్ కిడ్నాప్ కేసు.. ఏ2గా భూమా అఖిలప్రియ
Hyderabad CP Pressmeet over Bowenpally Kidnap case.హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏ2గా అరెస్ట్.
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2021 12:59 PM GMTహైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలు తెలియజేశారు. మనోవికాస్ నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటున్న ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సోదరులను 10 మందితో కూడిన బృందం కిడ్నాప్ చేసిందన్నారు. ఐటీ అధికారలమంటూ నకిలీ సెర్చ్ వారెంట్ చూపించి ఇంట్లోకి ప్రవేశించారని ఆ తరువాత ఇంట్లోని మహిళలను, చిన్నారులను ఓ గదిలో బంధించి ప్రవీణ్, సునీల్, నవీన్‌లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు.
మనీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. 15 బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. నిందితులు తమ కార్లకు కూడా నకిలీ నెంబరు ప్లేట్లు ఉపయోగించారని వెల్లడించారు. ఈ అపహరణ కేసులో సీసీ కెమెరా ఫుటేజి కీలకంగా మారిందని, ఫుటేజి సాయంతోనే అరెస్టులు చేయగలిగామని సీపీ చెప్పారు. కేవలం 3 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించామని పేర్కొన్నారు. ఈమొత్తం వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా మరికొందరికి సంబంధముందని చెప్పారు. ఈ కిడ్నాప్ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్ అని వివరించారు.
ఈ ఉదయం 11 గంటలకు అఖిలప్రియను అరెస్ట్ చేశామని తెలిపారు. కూకట్ పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని సీపీ వెల్లడించారు. కాగా, కిడ్నాప్ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్టు తేలిందని చెప్పారు. మిగతా నిందితులు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను, సాయి, చంటి ప్రకాశ్‌గా గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హఫీజ్ పేటలో 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్ కు కారణమని వివరించారు.