హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడి కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో తెలంగాణ బీజేపీ నాయకుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 12:06 PM IST
Hyderabad, BJP Leader, Tirupati, Kidnap,

హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడి కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో తెలంగాణ బీజేపీ నాయకుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. తన భర్త కనిపించడం లేదంటూ ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌కు గురైన బీజేపీ రాష్ట్ర నాయకుడు ముక్కెర తిరుపతి అని పోలీసులు తెలిపారు. తమ భూమి కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారని తిరుపతి భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. తిరుపతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత తిరుపతిరెడ్డి.. కుషాయిగూడలో నివాసం ఉంటున్నారు. ఆయన ఒక రియల్‌ ఎస్టేట్ వ్యాపారి. ఓల్డ్‌ అల్వాల్‌లోని పాకాల కుంటలో కోట్ల రూపాయల విలువైన స్థలం ఉంది. దానిపై కొన్ని నెలల క్రితం వివాదం తలెత్తింది. దాంతో.. తిరుపతిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ క్రమంలోనే జూలై 13న మధ్యాహ్నం తిరుపతిరెడ్డి కారులో డ్రైవర్‌తో కలిసి అల్వాల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు.

డ్రైవర్‌ చిన్న పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తిరుపతిరెడ్డి అక్కడ కనిపించలేదు. డ్రైవర్ కాసేపు వెతికినా లాభం లేకుండా పోయింది. అంతేకాక తిరుపతిరెడ్డి దగ్గరున్న రెండు ఫోన్లకు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌గా వచ్చింది. దాంతో చేసేదేం లేక డ్రైవర్ తిరుపతిరెడ్డి భార్యకు సమాచారం ఇచ్చాడు. దాంతో సుజాత అల్వాల్‌ పోలీసులను గురువారం రాత్రి ఆశ్రయించారు. తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థలం వివాదమే కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యర్థి వర్గంలోని పలువురు పేర్లను రాసిచ్చినట్లు సమాచారం. వారే తన భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె అంటోంది. సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు అల్వాల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌పై విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story