అఖిల సూసైడ్ కేసులో ప్రియుడు అరెస్ట్
జీడిమెట్లలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:31 AM GMTఅఖిల సూసైడ్ కేసులో ప్రియుడు అరెస్ట్
హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. షాపూర్‌నగర్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన బాలోబోయిన కుమార్ కుమార్తె అఖిల (22) ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే.. అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిల వెంటపడ్డాడు. తనని ప్రేమించాలని వేడుకున్నాడు. ఆమె లేకపోతే తనకు లైఫ్ లేదన్నట్లుగా నమ్మించాడు. ఎంతకీ అఖిల ఒప్పుకోకపోవడంతో చివరకు చనిపోతానని బెదిరించాడు.
ఇక చివరకు అతని ప్రేమను కాదనలేక అఖిల కూడా సాయిగౌడ్ ప్రేమను అంగీకరించింది. ఇంట్లో కూడా వీరిద్దరి విషయం తెలిసింది. అంతా మాట్లాడుకున్నారు. పెళ్లి చేయాలని కూడా పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయిగౌడ్ నుంచి అఖిలకు వేధింపులు మొదలు అయ్యాయి. దానికి తోడు కట్నం కావాలంటూ తరచూ చెబుతుండేవాడు. రూ.70 లక్షల కట్నం తీసుకురావాలని అలా అయితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మూడు, నాలుగు నెలలపాటు అఖిలను వేధించాడు సాయిగౌడ్. ఇక అంతడబ్బు తమ ఫ్యామిలీ ఇవ్వలేదని అతనితో చెప్పినట్లు తెలిసింది. దాంతో.. పెళ్లి చేసుకోనని యువతతితో చెప్పాడు. సాయిగౌడ్ చేస్తున్న మోసాన్ని అఖిల పెద్ద దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా తరచూ ఫోన్లు చేస్తూ నరకం చూపించాడు.
దాంతో అఖిల మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే 14 పేజీల సూసైడ్ లెటర్ రాసి గత బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించమని వెంటపడ్డాడనీ.. నువ్వే నా ప్రాణమని చెప్పాడనీ.. నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడని లేఖలో పేర్కొంది అఖిల. అదంతా నిజమని నమ్మి మోసపోయానని వాపోయింది. అమ్మానాన్న మాట విని ఉంటే సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలించారు. తాజాగా అఖిల్ సాయిగౌడ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.