విడాకుల కోసం లీగల్ నోటీసు అందడంతో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఘట్కేసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్కేసర్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎ.శేఖర్ మాట్లాడుతూ మృతుడు గట్టుపల్లి వెంకటేష్ డ్రైవర్ గా పని చేస్తూ ఉన్నాడని, ఇటీవల కొన్ని నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడని తెలిపారు. అతను 2019లో వివాహం చేసుకున్నాడు. వెంకటేష్ తల్లి అనారోగ్యంతో ఉండటంతో అతని భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ జంట కీసరలోని అద్దె ఇంటికి మారారు. అయినా కూడా గొడవలు ఆగలేదు. రెండు కుటుంబాల పెద్దలు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు. చివరికి ఆ మహిళ విడాకులు కోరిందని పోలీసులు తెలిపారు.
కొంతకాలంగా ఆ జంట మధ్య ఎటువంటి మాటలు లేవని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు రెండు రోజుల ముందు, ఆ మహిళ వేధింపులను చూపుతూ విడాకులు కోరుతూ లీగల్ నోటీసు పంపినట్లు తెలిసింది. ఇక ఇవి తట్టుకోలేక వెంకటేష్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. అతని తల్లి తన బంధువులను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం గాంధీ మార్చురీకి తరలించారు.