భార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త.. ఎందుకంటే..
ఓ భర్త తన భార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించాడు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 2:00 PM ISTభార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త.. ఎందుకంటే..
ఓ భర్త తన భార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించాడు. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో సంబంధాలు చూసి వారికి కట్టబెట్టేవాడు. అయితే.. ఆమె తన భార్య అని తెలియకుండా అబద్ధాలు చెప్పి వివాహాలు చేయించాడు. ఇక పెళ్లి తంతు తర్వాత ఇంట్లో తిష్ట వేసి.. నగదు, బంగారం.. వస్తువులను అపహరించేవాడు. దొంగతనం పూర్తయ్యాక ఇద్దరు దంపతులు అక్కడి నుంచి పరారయ్యేవారు. దొంగల గుట్టు ఎప్పటికీ ఎక్కువ కాలం దాగదు అన్నట్లుగా.. సదురు మహిళ గురించి పోలీసులు ఆరా తీయడంతో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో ఈ తరహా మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ.. తాను ఆమె సోదరుడిని అని చెప్పుకున్నాడు. ఆమెకు వివాహం చేశాక.. అబ్బాయి వారి ఇంట్లో తిష్ట వేసి చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు భార్య కూడా సహకారం అందించేదని పోలీసులు చెప్పారు. లేదంటే చోరీకి పాల్పడి ఆమే నేరుగా భర్త వద్దకు వచ్చేది.
ఈ మహిళ ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినదిగా పోలీసులు చెప్పారు. ఓ మహిళ తన కూతరు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగానే మోసాలకు పాల్పడుతున్న కూతురుని గుర్తించారు. అయితే.. తన కూతురు ఈ విధంగా చోరీలకు పాల్పడుతుందని తల్లికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. మహిళ అల్లుడిని గట్టిగా విచారించడంతో అసలు విషయాలన్నీ బయటపడ్డాయని చెప్పారు. భార్యాభర్తలను అరెస్ట్ చేశామనీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.