కరోనా కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ మహమ్మారి కారణంగా చాలా దారుణాలను చూడాల్సి వస్తోంది. భార్యకు కరోనా సోకింది. ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన భర్త.. ఆమెకు బతికుండగానే నరకం చూపించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెను బాత్‌రూమ్‌లో బంధించాడు. ఈ అవమానవీయ ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చోటు చేసుకుంది.
లక్సెట్టిపేటలోని గోదావరి గోదావరి రోడ్డులో పెద్దయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల పెద్దయ్య భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఇంట్లో కాకుండా బాత్ రూమ్‌లో ఉంచాడు. ఐదు రోజుల నుంచి ఆమెకు బాత్ రూమే ఐసోలేషన్ సెంటర్ అయింది. పగలు, రాత్రి ఆమె అందులోనే ఉంది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు తెలిపారు. సమాచారం గురించి తెలిసిన వెంటనే ఎస్‌ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు.
ఐసోలేషన్ సెంటర్‌కు పంపిస్తానని ఆమెకు ఎస్‌ఐ హామీ ఇచ్చారు. అక్కడ ట్రీమ్‌మెంట్ బాగుంటుందని, రావాలంటూ ఆమెకు నచ్చజెప్పినా మొండికేసింది. దీంతో పోలీసులు పెద్దయ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు ఇంట్లోని ఓ గదిని కేటాయించేలా ఒప్పించారు.