ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో దారుణం జరిగింది. పుట్టింటి నుంచి ఒక రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చిందని భార్యను అతికిరాతకంగా హతమార్చాడో భర్త. శనివారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య శ్రావణి (28) హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరు మండలం జమ్ములపాలేనికి చెందిన శ్రావణిని 10 ఏళ్ల కిందట పేర్నమిట్ట ఎస్సీ కాలనీకి చెందిన దారా నవీన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ నెల 18న తన పుట్టింటికి వెళ్లిన శ్రావణి.. అదే రోజు సాయంత్రం తిరిగి వస్తానని చెప్పింది. అయితే అదే రోజు కాకుండా 19వ తేదీన సాయంత్రం వచ్చింది. దీంతో భర్త కోపానికి గురయ్యాడు. ఎందుకు ఆలస్యం అయ్యిందంటూ భార్యను నిలదీశాడు. ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. గొంతు నులమడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.