దీపావళి పండుగ రోజే భార్యను చంపిన భర్త

దీపావళి పండుగ రోజే భార్యను చంపేశాడో భర్త. హైదరాబాదు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  14 Nov 2023 12:00 PM IST
Husband killed wife, Diwali festival, Crime news

దీపావళి పండుగ రోజే భార్యను చంపిన భర్త

కులాలు వేరైనా మనసులు ఒకటయ్యాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు.. కొన్ని ఏళ్లకే వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలతో పాటు భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి.. దీంతో దీపావళి పండుగ రోజే ఇంటి దీపాన్ని ఆర్పేసాడు ఆ భర్త.. హైదరాబాదు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరేడుమెట్ సిఐ శివకుమార్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలోని గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి (22) అనే యువతి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ శ్రీగిరి పల్లికి చెందిన మహేందర్ అనే యువకుడు ప్రేమించుకున్నారు.

మహేందర్ కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ ఇద్దరు 2019లో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చి జీవనం కొనసాగించారు. వారికి మూడేళ్ల కూతురు ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్ లోని కందిగూడాలో ఉండగా మహేందర్ ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. అప్పుడు భార్య స్రవంతి భర్తను బెయిల్ పై బయటకు తీసుకు వచ్చింది. అయితే అందుకు అయినా ఖర్చు విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. అనంతరం వీరు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమతా నగర్ కి మారారు. రోజు రోజుకీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో విసుగు చెందిన స్రవంతి తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది.

శనివారం రాత్రి సమయంలో భర్త మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఆదివారం ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో స్రవంతి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా భర్త కేవలం తన వస్తువులను మాత్రమే తీసుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా స్రవంతి భర్తతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే మహేందర్ ఆగ్రహానికి లోనై భార్య ముఖంపై, తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మహేందర్ భార్య మెడకు చున్నీ చుట్టి ఈడ్చికెళ్లి మంచం కింద దాచి పెట్టి అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు.

చెల్లి, బావ ఏమైనా గొడవ పడ్డారా అని స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్రవంతి ఇంటికి వెళ్ళాడు. కానీ స్రవంతి ఇంటికి తాళం ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా మంచం కింద స్రవంతి విగత జీవిగా పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని మహేందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Next Story