హైదరాబాద్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసు నమోదు కాగానే పరారైన అయిన కాకర్ల శ్రీనివాస్‌ను చెన్నైలో గుర్తించిన అధికారులు.. అక్కడే అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. నేడు శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఇళ్ల కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఇళ్లను అప్పగించకుండా మోసం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్‌లో నగరంలో 8 చోట్ల ఈడీ సోదాలు చేసింది. జయత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు సుమారు రూ.300 కోట్ల వరకు మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లించినట్లు కూడా ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడైన కాకర్ల శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు మరికాసేపట్లో సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.