నన్ను హిజ్రాగా మార్చారు.. మనస్థాపంతో ఆత్మహత్య
Hijra commits suicide over love failure.18ఏళ్ల యువకుడు హిజ్రాగా మారాడు. ఓ అబ్బాయిని ప్రేమించాడు.అయితే.. అతను వేరే వివాహం చేసుకోవడంతో.. మనస్థాపం చెంది..ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2021 5:56 AM GMT
18ఏళ్ల యువకుడు హిజ్రాగా మారాడు. ఓ అబ్బాయిని ప్రేమించాడు. అయితే.. అతను వేరే వివాహం చేసుకోవడంతో.. మనస్థాపం చెంది.. బంధువుతో వాట్సాఫ్ వీడియోకాల్ మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనతోపాటు మరో ముగ్గురు జడ్చర్ల యువకులు హిజ్రాలుగా మారినట్టు అతను బయటపెట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక పరిధి నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్ (18) తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం అతను కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికి ఆచూకీ దొరకలేదు. అయితే.. ఈ నెల 4వ తేదీ రాత్రి 9 గంటలకు తండాలో ఉంటున్న మేనమా కుమారుడు వినోద్‌కు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ప్రస్తుతం తాను కడప పట్టణం ఏఎస్ఆర్ కాలనీలో ఉంటున్నానని చెప్పాడు. కొందరు తనను హిజ్రాగా మార్చారని.. ఇప్పుడు తన పేరు శ్రీలేఖ అని చెప్పాడు. కడపలో నివాసం ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించానని.. అతడు వేరే వివాహం చేసుకున్నాడని తెలిపాడు. దీంతో మనస్థాపం చెందానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెబుతూనే పురుగుల మందు తాగాడు.
వెంటనే తండాలోని బంధువులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీకాంత్ అలియాస్ శ్రీలేఖను గుర్తించి ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శ్రీకాంత్ తనతో మాట్లాడుతున్న సందర్భంలో జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు యువకులు హిజ్రాల చెరలో ఉన్నట్టు, వారు కూడా హిజ్రాలుగా మారినట్టు చెప్పాడని వినోద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.