విద్యార్థినులతో హెచ్‌ఎం అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
Head Master misbehavior with female students in Khammam District.విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు
By తోట వంశీ కుమార్ Published on 23 Aug 2022 4:43 AM GMTవిద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు దారి తప్పాడని, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ గ్రామస్తులు, తల్లిదండ్రులు సదరు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సిరిపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సాలాది రామారావు ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. పాఠాలు చెప్పే సమయంలో చేతులు పట్టుకోవడం, శరీర బాగాలను తాకడం వంటివి చేస్తున్నాడు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల18న వైరాలో గాంధీ సినిమా చూసేందుకు వెళ్లారు పాఠశాల విద్యార్థులు.
సినిమా చూస్తున్న సమయంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చొని భుజాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను తాగిన కూల్ డ్రింక్ ను తాగాలంటూ వారిని బలవంతం చేశాడు. ఇంటికి వచ్చిన అనంతరం ఈ విషయాన్ని విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో చెప్పారు. ఆదివారమే వారు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. సోమవారం పాఠశాలకు కారులో రామారావు వస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
కారులోంచి కిందకు దించి చితకబాదారు. అక్కడి నుంచి సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్లి నిర్భందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. రామారావును స్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డుకునేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వేరే ప్రాంతానికి వెళ్తానని, లేదంటే సెలవులో ఉంటానని రామారావు చెప్పడంతో తల్లిదండ్రులు శాంతించారు. విద్యార్థినులను క్రమశిక్షణలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నానని, తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారని రామారావు అంటున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ అరుణ గ్రామంలో విచారణ చేపట్టారు.