ఎగ్ కర్రీ వండలేదని.. సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి.
By అంజి Published on 17 March 2024 11:28 AM ISTఎగ్ కర్రీ వండలేదని.. సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌమా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఓ మహిళ శవమై కనిపించింది. ఈ క్రమంలోనే ఆ మహిళ భాగస్వామిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. విచారణలో లల్లన్ యాదవ్ (35) మద్యం మత్తులో తన భాగస్వామిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కోడిగుడ్డు కూర చేయడానికి నిరాకరించడంతో అతను కోపంగా ఉన్నాడని, సుత్తి, బెల్టుతో కొట్టాడని వారు తెలిపారు. బీహార్‌లోని మాధేపురా జిల్లాలోని ఔరాహి గ్రామానికి చెందిన లల్లన్ యాదవ్‌ను ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతం నుండి పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్ బృందం అరెస్టు చేసింది.
చౌమా గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో అంజలి (32) అనే మహిళ బుధవారం శవమై కనిపించింది. మృతదేహాన్ని గమనించిన భవన కేర్‌టేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ్, అంజలిని మార్చి 10న గురుగ్రామ్ బస్టాండ్ నుండి పని ప్రదేశానికి తీసుకువచ్చారు. వారి సరైన పేర్లు, చిరునామాలు, ఐడీలు కూడా ఇంటి యజమాని తీసుకోలేదు. లల్లన్ యాదవ్ అంజలిని తన భార్యగా పరిచయం చేశాడు. ఆరేళ్ల క్రితం పాము కాటుతో తన భార్య చనిపోయిందని, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చానని లల్లన్ యాదవ్ విచారణలో వెల్లడించాడు. సుమారు ఏడు నెలల క్రితం, అతను అంజలిని కలిశాడని, ఇద్దరూ కూలి పని చేస్తూ కలిసి జీవించడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఆమెను హత్య చేసిన తర్వాత అతడు పారిపోయాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, బెల్టును స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని ప్రశ్నిస్తున్నామని పాలెం విహార్ ఏసీపీ నవీన్ కుమార్ తెలిపారు.