ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం
Gujarat Road accident.. 7 Dead... గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనం .
By సుభాష్ Published on 21 Nov 2020 3:27 PM ISTగుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్ వెహికల్ కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరి కొందరు గాయపడగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సురేంద్రనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రమాదం జరుగగానే కారులో భారీగా మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు అగ్నికి ఆహుతయ్యారు. కాగా, చోటిలమాత ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు.
కాగా, బుధవారం కూడా గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా, 17 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వాఘెడియా క్రాసింగ్ వద్ద రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి. కాగా, ఈ మధ్య కాలంలో గుజరాత్‌లో రోడ్డు ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి.