గుజరాత్‌లోని మోర్బి జిల్లా టంకారాలో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి భార్య విషయంలో తలెత్తిన గొడవ కారణంగా తన రెండో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని పొదల్లో పడేసిన ఒక వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు సంజయ్, తన మొదటి భార్య గంగా తనను వదిలి వెళ్ళిపోవడానికి రెండో భార్య శకుబేన్ కారణమని తరచూ ఆమెతో గొడవ పడేవాడు. మొదటి భార్య వెళ్ళిపోతూ పిల్లలను తన వద్దే వదిలేసిందని సంజయ్ తీవ్ర ఆవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి దంపతుల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన సంజయ్, ఒక బరువైన వస్తువుతో శకుబేన్ తలపై బలంగా కొట్టాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య అనంతరం సంజయ్ తన కొడుకును బెదిరించి, శవాన్ని తరలించేందుకు సహాయం చేయమన్నాడు. అయితే కొడుకు నిరాకరించగా, సంజయ్ స్వయంగా ఒక రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక ఆనకట్ట సమీపంలోని తుమ్మ పొదల్లో పడేశాడు. జరిగిన విషయాన్ని గమనించిన బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.