ఘోరం : వ‌డ్డీ చెల్లించ‌లేద‌ని శిక్ష‌గా భార్య‌పై అత్యాచారం

Gujarat man fails to pay loan interest.ఇటీవ‌ల కాలంలో వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాలు మితిమీరి పోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 8:31 AM IST
ఘోరం : వ‌డ్డీ చెల్లించ‌లేద‌ని శిక్ష‌గా భార్య‌పై అత్యాచారం

ఇటీవ‌ల కాలంలో వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాలు మితిమీరి పోతున్నాయి. అవ‌స‌రానికి అప్పు తీసుకుంటే బారు వ‌డ్డీలు, చ‌క్ర‌వ‌డ్డీలు అంటూ సామాన్యుల న‌డ్డి విరుస్తున్నారు. అసలుకు మూడు నాలుగు రెట్లు వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వారికి ఆశ చావ‌డం లేదు. వ‌డ్డీ చెల్లించ‌డంలో కాస్త ఆల‌స్యం అయితే చాలు మ‌హిళ‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డ్డుతున్నారు. చేసిన అప్పు తీర్చే మార్గం కాన‌రాక వారి చేష్ట‌ల‌ను కొంద‌రు మ‌హిళ‌లు మౌనంగా భ‌రిస్తున్నారు.

ఓ ఆటోడ్రైవ‌ర్ త‌న కుటుంబంతో క‌లిసి గుజ‌రాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలో నివ‌సిస్తున్నాడు. త‌న అవ‌స‌రాల నిమిత్తం 2021లో అజిత్ సింగ్ చావ్డా అనే వ‌డ్డీ వ్యాపారి ద‌గ్గ‌ర రూ.50 వేలు తీసుకున్నాడు. వ‌డ్డీగా ప్ర‌తీ రోజు రూ.1,500 చెల్లించాల‌నే ఒప్పందం వీరి మ‌ధ్య జ‌రిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కు ఆటోడ్రైవ‌ర్ రోజువారి వ‌డ్డీ స‌క్ర‌మంగా చెల్లించాడు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌క్ర‌మంగా క‌ట్ట‌లేక‌పోయాడు.

రోజువారి వ‌డ్డి కొండ‌లా పేరుకుపోయింది. వ‌డ్డీ వ్యాపారి అజిత్ సింగ్ వ్యాపార భాగ‌స్వామి దీపక్ వగడియాగా రంగంలోకి దిగాడు. ప్ర‌తి రోజు ఆటోడ్రైవ‌ర్ ఇంటికి వెళ్లి వ‌డ్డీ క‌ట్టాలంటూ వేధించేవాడు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద అంత న‌గ‌దు లేద‌ని, చెల్లించేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని వారు ప్రాధేయ‌ప‌డినా విన‌లేదు. త‌ప్పుడు కేసులు పెట్టి భ‌ర్త‌ను జైలుకి పంపిస్తాన‌ని బెదిరించి ఆటో డ్రైవ‌ర్ భార్య‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రోజు రోజుకి అత‌డి వేధింపులు అధికం అవుతుండ‌డంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story