కర్ణాటకలోని బెలగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసినందుకు వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఖానాపూర్ పట్టణంలో ఈ ఘటన జరగడంతో సదరు వ్యక్తిని హిండల్గా జైలుకు తరలించారు. జైలుకెళ్లిన వరుడిని సచిన్ పాటిల్‌గా గుర్తించారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. లోకమాన్య చౌల్ట్రీలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.
అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో వరుడి కుటుంబీకులు వంద గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వధువు కుటుంబం వారి తాజా డిమాండ్‌ను తీర్చడానికి నిరాకరించడంతో, నిందితుడు సచిన్ పాటిల్ వివాహానికి నిరాకరించాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసిన వధువు కుటుంబీకులు వరుడిపై ఖానాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అరెస్టు చేసి జైలుకు తరలించారు.