అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 4:01 PM ISTఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు. ఈ విషయమై ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. మూఢనమ్మకాల ఫలితంగానే ఈ ఘటన జరిగినట్లు కనిపిస్తోందని ధామ్‌ధా ఏరియా పోలీసు సబ్‌డివిజనల్ అధికారి సంజయ్ పుంధీర్ తెలిపారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని నన్‌కట్టి గ్రామంలో చోటుచేసుకుంది.
నిందితుడు గుల్షన్ గోస్వామి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. నిందితుడి వయసు 30 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుల్షన్ తన అమ్మమ్మతో కలిసి శివుని ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గదిలో నివసించేవాడు. ప్రతిరోజూ ఆలయంలో పూజలు చేసేవాడు. గుల్షన్ గోస్వామి, అతని అమ్మమ్మ రుఖమణి గోస్వామి 15 రోజుల క్రితం నందకట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలోని గుడిసెలో నివసించేందుకు వచ్చారు. దీనికి ముందు వారు ధౌరభంతంలో నివసించేవారు. గుల్షన్ తన ఇంటి ముందున్న శివాలయంలో నిత్యం పూజలు చేసేవాడు. శనివారం సాయంత్రం త్రిశూలంతో తమ ఇంట్లో ఉన్న అమ్మమ్మను హత్య చేసి.. ఆలయంలోని శివలింగానికి రక్తాన్ని అర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత గుల్షన్ ఇంటికి తిరిగి వచ్చి అదే త్రిశూలంతో అతని మెడపై పొడుచుకున్నాడు.. దీంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
గుల్షన్‌ను రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు. పుంధీర్ మాట్లాడుతూ.. 'ఈ సంఘటన మూఢనమ్మకాల ఫలితంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నామన్నారు.
సంఘటన జరిగిన రోజు ఉదయం నుంచి గుల్షన్ ప్రవర్తన అసాధారణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అతడు దిక్కుతోచని స్థితిలో.. మానసికంగా కలవరపడ్డాడని తెలిపారు. పోలీసులు ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గుల్షన్ కోలుకున్న తర్వాత హత్య వెనుక గల కారణాలను స్పష్టం చేయడానికి అతడిని విచారించనున్నారు. హత్యకు గల అసలు కారణాలేంటో తేలిన తర్వాతే ఈ వ్యవహారంలో అసలు నిజాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.