హైదరాబాద్‌లో దారుణం.. ఇంటికి పిలిచి ప్రియుడిపై యువతి పేరెంట్స్ దాడి

హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 2:05 PM IST
girl, parents, attack,    Hyderabad ,

హైదరాబాద్‌లో దారుణం.. ఇంటికి పిలిచి ప్రియుడిపై యువతి పేరెంట్స్ దాడి 

హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడని.. అతనిపై అమ్మాయి కుటుంబం పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే ఇంటికి పిలిపించి మరీ దారుణంగా కొట్టారు. అయితే.. ఎలాగోలా ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఒక వీడియో తీసి పోలీసులకు పంపాడు. ఆ తర్వాత యువకుడిని కాపాడిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏడాది క్రితం అబ్దుల్‌ సాహెల్‌ అనే యువకుడు తన ప్రియురాలితో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. యువతి బంధువులు ఆమె మైనర్‌ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టి చివరకు ఇద్దరిని పట్టుకున్నారు. మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు యువకుడు సాహెల్‌కు జైలు శిక్ష కూడా పడింది. కొద్దికాలం తర్వాత సాహెల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. యువతి బంధువులకు ఈ విషయం తెలిసింది. అతనిపై కోపం ఇంకా పోలేదు. యువకుడు తన ప్రేయసికి దూరంగానే ఉంటున్నా.. యువతి బంధువులు మాత్రం పగ పెంచుకున్నారు. ఎలాగైనా దాడి చేయాలని పన్నాగం పన్నారు. ఇందులో భాగంగానే తమ కూతురుతో సాహెల్‌కు బలవంతంగా ఫోన్ చేయించారు. కొడుకు పుట్టాడనీ.. ఇంటికి వచ్చి చూడాలని బలవంతంగా చెప్పించారు.

ప్రేయసి మాటలు నమ్మిన సాహెల్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఒక్కడే వెళ్లడంతో.. యువతి పేరెంట్స్‌ అతన్ని బంధించారు. ఆ తర్వాత సాహెల్‌ను తీవ్రంగా కొట్టారు. సాహెల్‌కు తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని.. అదే ఇంట్లో మరో గదిలోకి వెళ్లి లాక్‌ చేసుకున్నాడు సాహెల్. ఆ తర్వాత ఒక వీడియోను రికార్డు చేసి.. తన ప్రేయసి బంధువులు తనని బంధించి కొడుతున్నారంటూ చెప్పాడు. ఆ వీడియోను పోలీసులకు పంపాడు. ఇక పోలీసులు వెంటనే యువతి ఇంటికి వెళ్లారు. పోలీసులను అడ్డుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించినా.. పోలీసులు వీడియో చూపించి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న సాహెల్‌ను కాపాడారు. తలకు తీవ్ర గాయం కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై సాహెల్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story