ప్రియుడితో కలిసి ఉండగా చూశారని సొంత చెల్లెళ్లను చంపిన అక్క
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లను అక్క దారుణంగా హత్య చేసింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 10:14 AM ISTప్రియుడితో కలిసి ఉండగా చూశారని సొంత చెల్లెళ్లను చంపిన అక్క
మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. కన్నవారు.. తోడపుట్టినవారు.. కట్టుకున్నవారే ప్రాణాలను తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు ప్రాణాలు తీస్తుంటే.. ఇతరుల మాయలో పడి సొంతవారిని చంపుకుంటున్నారు. అయితే.. ఓ యువతి కూడా తన సొంత చెల్లెళ్లను దారుణంగా చంపింది. తాను ప్రియుడితో కలిసి ఉండటాన్ని ఇద్దరు చెలెళ్లు చూశారు. దాంతో.. వారిని హతమార్చింది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ గ్రామానికి చెందిన అంజలి (20) అనే యువతి గత కొన్నాళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల యువతి తల్లిదండ్రులు ఇంటినుంచి బయటకు వెళ్లారు. రావడానికి సమయం పడుతుందని తెలిసి.. ఆ యువతి నేరుగా ప్రియుడిని ఇంటికే పిలిపించుకుంది. అయితే.. ప్రియుడితో కలిసి సన్నిహితంగా ఉన్న సమయంలో వారిద్దరినీ అంజలి చెల్లెళ్లు చూశారు. అంజలికి ఆరేళ్ల, నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రియుడితో కలిసి ఉన్న విషయం చెల్లెళ్లు తల్లిదండ్రులకు ఎక్కడ చెప్పేస్తారో అని యువతి భయపడిపోయింది. దాంతో.. దారణంగా ఆలోచించింది.
బతికి ఉంటేనే కదా తల్లిదండ్రులకు చెప్తారని.. ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా పొడిచి హత్య చేసింది యువతి. అయితే.. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు చిన్న కూతుళ్లు రక్తపుమడుగులో పడిఉండటాన్ని చూసి షాక్ తిన్నారు. లబోదిబోమన్నారు. అంజలి ఇంటి వద్దే ఉన్నా.. చెల్లెళ్లను ఎవరో చంపేశారని ఎవరో తెలియదంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అంజలి దుస్తులపై రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు. ఆమెను గట్టిగా నిలదీసి అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కాగా.. రెండు హత్యల్లో యువతికి మరికొందరు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. పోలీసులు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.