తన భార్య వెళ్లిన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో చూసిన ఒక వ్యక్తి రద్దీగా ఉండే రోడ్డుపై ఆమెను కాల్చి చంపాడు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని బాధితురాలి భర్త అరవింద్ పరిహార్ అని పోలీసులు నిర్ధారించారు. నాలుగు రోజుల క్రితం తన భార్య నందిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను చూసిన తర్వాత అరవింద్ కోపంగా ఊగిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ వీడియోలో ఆమె తన స్నేహితుడు అంకుష్ పాఠక్ పుట్టినరోజు వేడుకకు హాజరైంది. నందినికి అంకుష్ పాఠక్ తో పరిచయం ఉందని అధికారులు తెలిపారు, ఇది అరవింద్ కోపాన్ని మరింత పెంచింది. అంకుష్ మరొక సహచరుడు కల్లుతో నందినిని చూసిన అరవింద్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది.
అరవింద్, నందిని పరిహార్ 2023 లో ఆర్య సమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. కానీ కొద్దికాలానికే, అరవింద్ కు అప్పటికే పెళ్లి అయిందని, వారికి ఒక బిడ్డ కూడా ఉందని నందికి తెలియడంతో వారి వివాహ సంబంధం చెడిపోయింది. దీని తరువాత, నందిని అతనిపై ఫిర్యాదు చేసింది. వివాదం తీవ్రమవడంతో అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫిర్యాదు తర్వాత పోలీసులు అరవింద్ ను అరెస్టు చేశారు, జైలు నుండి విడుదలైన తర్వాత అతను ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించాడు. గత మంగళవారం, నందిని ఎస్పీ కార్యాలయానికి చేరుకుని, తన భర్త, అతని కుటుంబం తనను హింసిస్తున్నారని ఆరోపించింది.
నందిని తన సహచరులు కల్లు, అంకుష్ లతో కలిసి రిక్షాలో ప్రయాణిస్తుండగా, అరవింద్ మరో రిక్షాలో ఆమెను అనుసరించాడు. అతను వారి వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపి పట్టపగలు ఆమెపై ఐదుసార్లు కాల్పులు జరిపాడు. చివరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.