హైదరాబాద్‌లో మరో దారుణం.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని.. యువతిపై స్నేహితుడి లైంగిక దాడి
Friend molestation Gujarat Women in Pragathi Nagar.ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2022 8:36 AM ISTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే మరో యువతిపై జరిగిన లైంగిక దాడి కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజున రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి.. ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్ రాష్ట్రంలోని వడదోర చెందిన 28 ఏళ్ల యువతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తి అయ్యాక ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఓ కంపెనీలో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 13న ఓ స్నేహితుడు తన పుట్టిన రోజు కావడంతో రిపీట్ పబ్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి యువతిని కూడా ఆహ్వానించాడు. పార్టీ ఆలస్యంగా ముగియడంతో ప్లాట్ వద్ద యువతిని దింపేందుకు కొందరు స్నేహితులు వచ్చారు.
తెల్లవారుజామున 5 గంటల వరకు అందరూ యువతి ప్లాట్‌లో పిచ్చాపాటిగా కబర్లు చెప్పుకుని సరదాగా గడిపారు. అనంతరం యువతి తన గదిలో పడుకోగా..మిగిలిన వారు మరో గదిలో పడుకున్నారు. కొద్ది సమయం తరువాత రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు యత్నించింది. అయితే.. అతడు తనను కొట్టి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి 15వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ ఇందుకు సహకరించారా? తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.