ఆస్ప‌త్రిలో ఘోర అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు చిన్నారులు మృతి.. సీఎం దిగ్భ్రాంతి

Four children die in Bhopal hospital fire.చిన్న పిల్ల‌ల ఆస్ప‌త్రిలోని ఐసీయూ వార్డులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2021 7:44 AM IST
ఆస్ప‌త్రిలో ఘోర అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు చిన్నారులు మృతి.. సీఎం దిగ్భ్రాంతి

చిన్న పిల్ల‌ల ఆస్ప‌త్రిలోని ఐసీయూ వార్డులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు చిన్నారులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని భోపాల్ న‌గ‌రంలోని చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. భోపాల్‌లోని క‌మ‌లా నెహ్రూ ఆస్ప‌త్రిలోని మూడవ అంతస్తులోని పీడియాట్రిక్ ఐసీయూలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు.

మంట‌లు ఎగిసిప‌డ‌డంతో ఆస్ప‌త్రిలో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చిన్నారుల‌ను తీసుకుని అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ ప్ర‌మాదం నుంచి 36 మంది చిన్నారులు సురక్షితంగా బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టికి న‌లుగురు చిన్నారులు మంట‌ల‌కు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

ఘ‌ట‌న స‌మాచారం అందిన వెంట‌నే.. మంత్రి విశ్వాస్‌ సారంగ్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించారు. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం తెలిసిన వెంట‌నే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి త‌ల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Next Story