అనుమానాస్పద స్థితిలో షేక్‌పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణించారు. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్తలు రాగా.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహం నిమ్స్ ఆస్పత్రిలో ఉంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని రూ. 40 కోట్ల విలువైన భూ వివాదంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో తహసీల్దార్ సుజాతను 2020 జూన్ 8న పోలీసులు అరెస్టు చేశారు. సుజాత జైలులో ఉండగానే ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుజాత భర్తను కూడా అప్పట్లో ఏసీబీ అధికారులు విచారించారు.
బెయిల్‌పై విడుదలైనా.. భర్త మరణించిన నాటి నుంచి ఆమె తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించారు. ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు కొందరు అంటుండగా.. గుండెపోటుతోనే మృతి చెందారని బంధువులు చెబుతున్నారు.