Telangana: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతి జానపద పాటలతో ఫేమస్ అయ్యింది.
By అంజి Published on 19 Dec 2024 7:16 AM ISTTelangana: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
చక్కటి స్వరం.. అందరూ మెచ్చే గాన కోకిల.. అవకాశాలు మెండుగా వచ్చాయి.. ఫోక్ సింగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇంతలోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది... చట్టా పట్టాలు వేసుకుని ఊరంతా తిరిగింది.. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోయినా ధైర్యంగా ఆ యువకుడిని పెళ్లాడింది.... చివరకు కట్నకానుకల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది ఆ గాన కోకిల.
కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతి జానపద పాటలతో ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే శృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ జంట పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కానీ ఇరుకుటుంబ సభ్యులు వీరి పెళ్లిని నిరాకరించారు.
దీంతో ఈ ప్రేమ జంట ఎవ్వరికీ తెలియకుండా 20 రోజుల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తే తన భర్తగా రావడంతో కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది శృతి.. కానీ శృతి ఊహాలన్నీ తలకిందులయ్యాయి. కట్న కానుకల కోసం ఫోక్ సింగర్ శృతిని అత్తమామలు వేధింపులకు గురి చేశారు. రోజురోజుకి వారి వేధింపులు మితిమీరిపోవడంతో శృతి పెళ్లయిన 20 రోజులకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కూతురు మరణించిందన్న వార్త వినగానే తల్లిదండ్రులు గుండలవిసేలా రోదించారు. ఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు.. అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శృతి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.