చెన్నైలోని కిల్‌పాక్‌లో విషాద ఘటన జరిగింది. జనవరి 29 ఆదివారం నాడు ఐదేళ్ల బాలికపై ఇనుప గేటు పడి మరణించింది. హరిణిశ్రీ అనే బాలిక జనవరి 28 శనివారం నాడు తన తల్లి వాణితో కలిసి కిల్‌పాక్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చింది. అక్కడే ఇనుప గేటు బాలిక మీద పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ కిల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్చారు. చికిత్సకు స్పందించకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.
పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (మానవ ప్రాణాలకు హాని కలిగించే నిర్లక్ష్యం), 304 (ఎ) (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్ మేనేజర్ శ్రీనివాసన్, వాచ్‌మెన్ సంపత్‌లను అరెస్టు చేశారు. బాలిక తండ్రి శంకర్ కాంప్లెక్స్‌లో వాలెట్‌గా పనిచేశారని, అతని భార్య, కుమార్తె అతనిని చూడటానికి వచ్చారని పోలీసులు చెప్పారు. హరిణిశ్రీ సంపత్‌తో మాట్లాడుతూ గేటు దగ్గర వేచి ఉండగా, వాణి శంకర్‌ని తీసుకురావడానికి లోపలికి వెళ్లింది.
సంపత్ 4 అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవు ఉన్న స్లైడింగ్ గేట్‌ను మూసివేస్తున్నాడు. హఠాత్తుగా గేటు ఊడి హరిణిశ్రీపై పడింది. బాలిక తలపై, శరీరంపై చాలా గాయాలున్నాయని ప్రముఖ పత్రిక తెలిపింది. ఆదివారం బాలిక మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ తర్వాత వాచ్‌మెన్, బిల్డింగ్ మేనేజర్ దోషులని తేలిందని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.