సీరం ఇన్‌స్టిట్యూట్ అగ్నిప్రమాదం... ఐదుగురి మృతి

Five killed in fire at Serum Institute of India.పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్ లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఐదురుగు మృతి చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2021 1:34 PM GMT
Fire accident at Serum Institute of India

పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్ లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఐదురుగు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్‌-3 భ‌వ‌నంలోని 4,5 అంత‌స్తుల్లో మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా మంట‌లు చేల‌రేగి ద‌ట్ట‌మైన పొగ‌లు అలుముకున్నాయి. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. 10 ఫైరింజ‌న్లు రంగంలోకి దిగి దాదాపు రెండు గంట‌లు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. మంట‌ల‌ను ఆర్పివేసిన త‌రువాత ఐదు మృత‌దేహాల‌ను గుర్తించారు. అయితే.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వెల్లడించారు.

అగ్నిప్రమాదం ఘటనపై సీరం సీఈవో అదార్ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటంబాలకు సంతాపం తెలిపారు. 'ఇప్పుడే బాధ‌ను క‌లిగించే అప్‌డేట్స్ వ‌చ్చాయి. ఈ ప్ర‌మాదంలో దుర‌దృష్ట వ‌శాత్తు కొంత ప్రాణ‌న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలిసింది. చాలా బాధ‌ప‌డుతున్నాం. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు మా ప్ర‌గాడ సానుభూతి తెలుపుతున్నాం' అని ట్వీట్ చేశారు.


కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోన్న యూనిట్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బిల్డింగ్ లో ఈ అగ్రిప్రమాదం జరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి ఆందోళనలు వ్యక్తమవగా సీరం సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అగ్నిప్రమాద ఘటనతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని తెలిపింది. కాగా.. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.




Next Story