స్తంభాన్ని ఢీకొట్టి కారు బోల్తా.. ఐదుగురు మృతి
Five killed in a car overturn in Una, Himachal
By అంజి Published on 11 Sept 2022 4:01 PM ISTహిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలో కారు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి పంజాబ్ నంబర్ ప్లేట్‌తో సంతోష్‌గఢ్ నుంచి ఉనా వెళ్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొని కుతార్ కలాన్‌లోని పొలాల్లో పడిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు ఉనాలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని పోలీసులు తెలిపారు.
విషయం తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకుని యువకులను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కుతార్ కలాన్ గ్రామంలో ఉనా జిల్లాకు చెందిన రాజన్ జస్వాల్, అమల్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన కారు డ్రైవర్ హర్యానాలోని మజ్రాకు చెందిన విశాల్ చౌదరి, పంజాబ్‌లోని హాజీపూర్‌కు చెందిన సిమ్‌రంజీత్ సింగ్, హిమాచల్‌లోని ఝలేదాకు చెందిన అనూప్‌సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.