మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అగర్ మల్వా జిల్లాలోని పచేటి తిల్లారి డ్యామ్‌లో పడవ మునిగి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పిల్లలున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే అంత్యక్రియల కోసం మరో రూ.5 వేల చొప్పున ఇస్తామని సీఎం శివరాజ్
సింగ్ చౌహన్ ట్వీట్ చేశారు. ముగ్గురు పిల్లలతో పాటు ఇద్దరు మహిళలు డ్యామ్‌లో మునిగి మృతి చెందారని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందం మృతదేహాలను వెలికి తీసిందని జిల్లా కలెక్టర్ అవదేష్ శర్మ తెలిపారు.
కాగా, మృతులు లాఖాఖేది గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలతో కలిసి మర పడవలో తిల్లారి డ్యామ్ దాటి మరొక వైపు ఉన్న ఆలయానికి బయలుదేరారు. ప్రమాదవశాత్తు పడవ మధ్యలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతులు సునీత (40), రంకన్య (36), జయ (12), ఆల్కా (13)లుగా గుర్తించారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.