శివకాశిలో భారీ పేలుడు.. 6గురి మృతి.. 14 మందికి గాయాలు
Five die in Sivakasi fire cracker unit accident.తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణ సంచా తయారీ పరిశ్రమలో
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2021 2:20 AM GMTతమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణ సంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 14 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలోని తంగరాజ్ పాండియన్‌కు చెందిన బాణసంచా తయారీ కేంద్రంలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. గురువారం సాయంత్రం అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. తొలుత ఓ గదిలో పేలుడు సంభవించగా.. క్రమంగా పది గదులపై ప్రభావం చూపింది. దీంతో పది గదులు నేలమట్టం అయ్యాయి.
ఈ గదుల్లో ఉన్న కార్మికులను రక్షించ లేని పరిస్థితి. అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నా, బాణసంచాలు పేలుతూనే ఉండడంతో ఆటంకాలు తప్పలేదు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి క్షతగాత్రులను రక్షించారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు.
ఈ పరిశ్రమకు అనుమతి ఉన్నా.. పేలుడుకు గల కారణాలపై విచారణ సాగుతోంది. ఈ ప్రమాదంతో ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండాయి. శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో పేలుడు ఘటనలు జరగడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 12న అచ్చంకుళంలోని ఓ బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.