విషాదం.. సాయం చేసేందుకు వెళ్లి ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five dead after truck crushes pedestrians in UP's Lakhimpur Kheri.రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో సాయం చేయ‌డానికి వెళ్లారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2023 8:38 AM IST
విషాదం.. సాయం చేసేందుకు వెళ్లి ఐదుగురు దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో సాయం చేయ‌డానికి వెళ్లారు. బాధితుల‌కు సాయం చేస్తున్న క్ర‌మంలో ఓ ట్ర‌క్కు అటు వైపుగా దూసుకువ‌చ్చింది. అదుపు త‌ప్పి వీరిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 5 గురు మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని లఖింపూర్‌ ఖేరీలో జ‌రిగింది.

లఖీంపూర్‌ ఖేరీలోని గోలా బెహ్రైచ్‌ జాతీయరహదారిపై ఓ స్కూటీ, కారు ఢీ కొన్నాయి. ఘ‌ట‌నాస్థ‌లంలో స్థానికులు గుమిగూడారు. గాయ‌ప‌డిన వారికి సాయం అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో వేగంగా దూసుకువ‌చ్చిన ఓ భారీ ట్ర‌క్కు వీరిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 5 గురు మ‌ర‌ణించారు. మ‌రో 10 మందికి పైగా తీవ్ర‌గాయాలు అయ్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ ప్ర‌మాదంపై సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతుల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Next Story