గుడిసెకు మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 10:48 AM ISTప్రతీకాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్‌లోఘోర ప్రమాదం జరిగింది. ఓ గుడిసెకు మంటలు అంటుకుని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజరదేరా గ్రామంలో చోటుచేసుకుంది.
సతీకుమార్, కాజల్ దంపతులు తమ ముగ్గురు చిన్నారులతో కలిసి హర్మౌ బంజారదేరా గ్రామంలో ఓ గుడిసెలో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే రాత్రి భోజనం తరువాత వారు నిద్ర పోయారు. అయితే.. అర్థరాత్రి సమయంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గుడిసె మొత్తం వ్యాపించాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సతీష్‌కుమార్ ఆయన భార్య కాజల్, వారి ముగ్గురు పిల్లలు సజీవ దహనం అయ్యారు.
ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన సతీష్ తల్లికి కూడా గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం మరియు డాగ్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు.
"సతీష్ మరియు అతని కుటుంబం అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారనే సమాచారం మాకు అందింది. మేము ఫోరెన్సిక్ బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు మరియు డాగ్ స్క్వాడ్ బృందాన్ని విచారణ కోసం పిలిచాము. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు." అని కాన్పూర్ దేహత్ తెలిపారు. సతీష్ తల్లి చికిత్స పొందుతున్న జిల్లా ఆస్పత్రిని డీఎం నేహా జైన్ సందర్శించారు.