రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
Firing on Realtor in Karnanguda.ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పులు కలకలం
By తోట వంశీ కుమార్ Published on 1 March 2022 12:31 PM ISTఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ స్కార్పియో వాహనంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరుపగా.. శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందగా.. రాఘవేందర్‌రెడ్డి అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ కారును గుర్తించారు స్థానికులు. దానిపై రక్తపు మరకలు ఉండడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా.. అందులో ఓ వ్యక్తి చనిపోయి ఉండగా.. మరో వ్యక్తి స్పృహ కోల్పోయి ఉన్నాడు. స్థానికుల సమచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్ గాయమైందని వైద్యులు వెల్లడించారు.
పటేల్ గూడలో వేసిన 22 ఎకరాల వెంచర్ పై గొడవ వల్లే కాల్పులు జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లు మట్టారెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంచర్ వేశారని.. అయితే కొద్ది రోజులుగా ఈ విషయంలో గొడవ జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు ఈ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను మట్టారెడ్డి పిలిపించాడని అన్నారు. మాట్లాడేందుకు కారులో వారు బయలుదేరిన సమయంలో ఈ దాడి చేసినట్లుగా వారు చెబుతున్నారు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.