కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరత నివారణకు చర్యలు చేపట్టింది. రైల్వే శాఖ సాయంతో గూడ్స్ రైళ్లలో ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆక్సిజన్ తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి రాయ్‌చూర్ కు ఆరు ట్యాంకర్లతో ఈ రైలు వెలుతోంది.
పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద ఓ ట్యాంకర్‌లో ఆకస్మాత్తుగా మంటలు రేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న ట్యాంకర్ నుంచి మిగతా వాటిని విడదీసి మంటలను అదుపుచేశారు. మంటలు చెలరేగిన ట్యాంకర్‌పై విద్యుత్ లైన్ ఉండడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బ్రేక్ వేసిన సమయంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.