జగిత్యాల పట్టణంలోని ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.
శనివారం ఉదయం కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయిల్ మిల్లులో మంటలు చెలరేగాయి. క్రమంగా మిల్లు మొత్తానికి వ్యాపించాయి. మిల్లులో 7 గ్యాస్ సిలిండర్లు ఉండగా అందులో ఒకటి భారీ శబ్ధంతో పేలిపోయింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో స్థానికులు దూరంగా పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మిల్లు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను పోలీసులు ఖాళీచేయించారు. అగ్నిమాపక బృందం రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు బావిస్తున్నారు.