మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
వెంకటాపూర్ పంచాయతీలోని గుడిపెల్లిలోని మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెంకుటిల్లు కావడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. క్షణాల్లో ఇళ్లు మొత్తం వ్యాపించాయి. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే మాంసం ముద్దలుగా మారారు. స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే ఇళ్లు పూర్తిగా దగ్థమైంది. మృతులను మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె (25), ఆమె ఇద్దరు కుమార్తెలు స్వీటీ(4), హిమబిందు(2), సింగరేణి ఉద్యోగి శాంతయ్య(50) లుగా గుర్తించారు.
కాగా.. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక రెండు రోజుల క్రితమే పద్మ వాళ్లింటికి వచ్చింది. డీసీపీ అఖిల్ మహాజన్, సీఐ ప్రమోదరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? లేక ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.