విశాఖలోని దువ్వాడ సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident in Divvada SEZ.విశాఖ జిల్లా దువ్వాడలోని సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By తోట వంశీ కుమార్ Published on 11 April 2021 4:58 PM ISTవిశాఖ జిల్లా దువ్వాడలోని సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పూజా స్ర్కాప్ పరిశ్రమలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు చెలరేగడంతో పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూజా స్క్రాప్ ఇండస్ట్రీలో రెండవ క్వాలిటీ కంప్యూటరు, విడిభాగాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతర వస్తువులు ఇక్కడ నిల్వ ఉంచుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసే ఈ వస్తువులు తయారుచేసి దేశంలో అమ్మకాలు జరుపుతారు.
అయితే.. బహిరంగ ప్రదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం వలన ఎండ వేడిమి కారణంగా ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైబర్, కాపర్ , సిల్వర్ , ఉండడం వలన మంటలు త్వరగా అదుపులోకి రావడం లేదు. అయితే.. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతున్న విశాఖలో ఇటీవల వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరం చుట్టూ భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. చాలాచోట్ల నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో మరోసారి అధికారులు ఆయా కంపెనీలపై కరొడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.