ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ పలవలహళ్లి వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎస్‌వీటీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు వైఎస్ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే 10 మంది మరణించగా.. మరో 25 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పావగడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారు అన్న దానిపై స్పష్టత లేదు. కాగా.. ఓవర్‌లోడ్‌తో వెలుతున్న బస్ టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. ఇక చనిపోయిన వారిలో టాప్ నుంచి కిందకు దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.