ప్రేమ విఫలం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ప్రేమ విఫలమైంది. ప్రియుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 13 Sept 2023 8:39 AM ISTప్రేమ విఫలం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలమైంది. ప్రియుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలలోని పద్మశాలీ వీధికి చెందిన ప్రైవేట్ కరెంట్ పని చేసుకునే రాజనర్సు, అంగన్‌వాడీ కార్యకర్తల విజయలక్ష్మీల కుమార్తె మౌనిక (23) బీటెక్ పూర్తి చేసింది. గత నాలుగు నెలల నుంచి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. ఫ్రెండ్‌తో కలిసి అస్‌బెస్టాస్ కాలనీ సమీపంలోని నెహ్రూనగర్‌లో రూమ్‌ని రెంట్‌కు తీసుకుని ఉంటున్నారు.
మౌనిక కొన్ని రోజుల నుంచి సాయి కుమార్ అనే వ్యక్తిని లవ్ చేస్తోంది. అతడిని వివాహం చేసుకుంటానని రెండు నెలల కిందట తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు మౌనిక ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన ప్రియుడు మరో అమ్మాయితో వివాహానికి రెడీ కావడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి లోనైంది. ప్రతి రోజూ తల్లిదండ్రులు ఆమెతో ఫోన్ మాట్లాడుతుండేవారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే.. ఆమె స్పందించలేదు. మంగళవారం ఉదయం ఫోన్ చేయగా స్పందించకపోవడంతో స్నేహితురాలికి ఫోన్ చేయగా.. వారం రోజుల నుంచి స్వగ్రామంలో ఉంటున్నానని తెలిపింది.
స్నేహితుడిని రూమ్‌కి పంపిస్తానని చెప్పి.. పంపగా తలుపులు తెరచుకుని ఉన్నాయి. మౌనిక అపస్మారకస్థితిలో ఉంది. ఆమె శరీరం ఆకుపచ్చ రంగులో కనిపించింది. పక్కన పురుగుల మందు డబ్బా కనిపించింది. మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.