దారుణం : భార్యపై కోపం.. పిల్లల్ని బావిలోకి తోసి.. ఆపై రైలుకిందపడి
Father throws two children into well.వారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే..
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 1:12 PM ISTవారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే.. భార్యపై కోపంతో ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలు తీశాడు ఆ భర్త. అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గడ్డిగూడెం తండాకు చెందిన భూక్య రామ్‌కుమార్(32) అదే తండాకు చెందిన శిరీషను తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు అమీ జాక్సన్(6), కుమారుడు జానీబెస్టో(4) సంతానం. రామ్‌కుమార్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్. ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ అని నాలుగు రోజుల క్రితం గడ్డిగూడెం తండాకు వచ్చారు.
కాగా.. గత కొద్దిరోజులుగా ఆర్థిక అంశాలపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కూడా మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య పై రామ్‌కుమార్ చేయిచేసుకున్నాడు. దీంతో శిరీష పిల్లలను అక్కడే వదిలేసి పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్లింది. ఆవేశంలో ఉన్న రామ్‌కుమార్ తన పిల్లలను బండిపై పొలానికి తీసుకువెళ్లి ఇద్దరిని బావిలో తోసేశాడు. ఈ విషయాన్ని అన్న భాస్కర్ కు చెప్పి రామ్‌కుమార్ పరారు అయ్యాడు. స్థానికుల సహకారంతో బావిలోంచి పిల్లలను బయటకు తీయగా.. అప్పటికే వారు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 8 గంటల తరువాత తండాకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని అనంతారం సమీపంలో రైల్వేట్రాక్‌పై కృష్ణా ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.