దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దాడులు ఆగడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో తప్పుచేసిందని తన కుమారైను చంపి.. తలను శరీరం నుంచి వేరు చేసి వీధుల్లో తిరిగిన ఘటనను మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగుచేసింది. వివాహిత తన ప్రియుడితో పారిపోవడంతో ఆగ్రహించిన ఆ యువతి తండ్రి ఆమెను తీసుకువచ్చాడు. తండ్రీ, కుమారై మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆ తండ్రి ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దౌసా జిల్లాలో శంకర్ లాల్ సైని అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 16న తన కుమారై పింకి(19)కి ఓ వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశాడు. అయితే.. ఆమె ఫిబ్రవరి 21న పుట్టింటికి వచ్చింది. అదే రోజు రాత్రి తన ప్రియుడు రోషన్ మహావర్‌తో కలిసి పారిపోయింది. ఈ విషయాన్ని తండ్రి శంకర్ లాల్ తట్టుకోలేకపోయాడు. మరోవైపు తాము పెండ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పింకి, ఆమె ప్రియుడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మార్చి 1న గ్రామంలోని ఆ యువకుడి ఇంటికి వారిద్దరు తిరిగి వచ్చారు. ఆరోజు రాత్రి పింకి ఆమె కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లాక.. తండ్రి, కుమారై మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో కుమారై పింకి గొంతు నొక్కి హత్య చేశాడు. నా భార్యను కిడ్నాప్ చేశారంటూ ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పింకి తండ్రి శంకర్ లాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.