ఉగాది పండుగను పుట్టింటిలో జరుపుకోవడానికి వచ్చిన కూతురు.. తండ్రి చేతిలో హతమైంది. తల్లిదండ్రుల మధ్య గొడవ జరుగుతుండగా.. తండ్రిని అడ్డుకోబోయిన వారి కుమారై మృత్యువాత పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని కరడికల్ గ్రామంలో అరుణాచలం తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి కుమారై వెంకటలక్ష్మీ(20)ని నాలుగు నెలల క్రితం కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌కి ఇచ్చి పెళ్లి చేశారు.
ప్రస్తుతం వెంకటలక్ష్మీ మూడు నెలల గర్భిణి. ఉగాది పండగను పుట్టింటి వారితో జరుపుకునేందుకు వెంకటలక్ష్మీ వచ్చింది. పండుగ మరుసటి రోజు రాత్రి అరుణాచలం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లోని భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లో దాచిన నాటు తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. ఇది చూసిన వెంకటలక్ష్మీ.. తండ్రిని అడ్డుకునేందుకు వెళ్లగా తుపాకీ గుండు పేలింది. దీంతో వెంకటలక్ష్మీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అరుణాచలం తుపాకీ అక్కడే పడేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలింపు చేపట్టారు.