దారుణం.. కన్నతండ్రే కాటేశాడు
Father rapes his Daughter in Rajendernagar.సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనను మరువకముందే
By తోట వంశీ కుమార్
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనను మరువకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమారై పై కన్నేశాడు. భార్య చనిపోవడంతో.. గత 15 రోజులుగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనారోగ్యంతో అతడి భార్య కొద్దిరోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి తండ్రీ, కుమారై ఇద్దరే ఉంటున్నారు. భార్య లేకపోవడంతో.. అతడి కన్ను కుమారై పడింది. బాలికను బెదిరించి గత 15 రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తన బాధను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక బాలిక సతమతమవుతోంది. ఈ క్రమంలో బుధవారం ఇంటి బయట ఏడుస్తూ కూర్చోంది.
ఏమైందని స్థానికులు ఆరా తీయగా.. విషయం మొత్తం చెప్పింది. కోపోద్రిక్తులు అయిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.