నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన శివరాములును భార్య ఆరేళ్ల క్రితం వదిలిపెట్టింది. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో భర్త.. తన పిల్లలను హత్య చేశాడు. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను ఉరితీసి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలను యాపల్ చెరువులో పడవేశాడు.
హత్యల తర్వాత, అతను విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని, కానీ ఆ ప్రయత్నం విఫలమైందని తెలుస్తోంది. ఆ తర్వాత అతను పురుగుమందు తాగి స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఈ సంఘటనను గమనించి శివరాములును చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.