కన్నతండ్రి పైశాచికం.. మూడోసారి ఆడపిల్ల పుట్టిందని
Father killed three months baby girl in Komrambim Asifabad.మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తల్లి కడుపులో
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 8:22 AM IST
మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తల్లి కడుపులో పడినప్పటి నుంచి మరణించే వరకు ఏ వైపు నుంచి ఏ ఆపద వస్తుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరికి రక్తం పంచిన తండ్రి నుంచి సైతం ముప్పును ఎదుర్కొంటున్నారు. లింగభేదం చూడకుండా ఉన్నంతలో మంచి జీవితాన్ని అందించాల్సింది పోయి.. పెంపకం, కట్నాలకు భయపడి వారి ఉసురు తీస్తున్నారు. వరుసగా మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో ఓ కర్కోటక తండ్రి.. ఆ చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాగజ్‌నగర్ మండలంలోని లైన్‌గూడ గ్రామంలో బాపురావు-మనీషా దంపతులు నివసిస్తున్నారు. వీరికి మౌనిక(5), అశ్విని (3) సంతానం. 45 రోజుల క్రితం మనీషా మూడో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. అప్పటి నుంచి బాపురావు రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా బాగా మద్యం తాగి వచ్చాడు. మౌనిక, అశ్వినిలు టీవీ చూసేందుకు పక్కంటిలోకి వెళ్లారు.
భార్య మనీషాను బాపురావు తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక మనీషా.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విచక్షణ కోల్పోయిన బాపురావు.. మంచంలో నిద్రిస్తున్న 45 రోజుల చిన్నారిని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి.. నేలకేసి కొట్టాడు. దీంతో అక్కడిక్కడే చిన్నారి మృతి చెందింది. అనంతరం బాపురావు.. సర్పంచ్ ఇంటికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. సర్పంచ్ సమాచారం మేరకు వాంకిడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి బాపురావుని అదుపులోకి తీసుకున్నారు.