విషాదం.. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి
విషాదం.. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతదేహాన్ని చూసేందుకు సైతం ఆ కూతురు తిరిగి రాలేదు. పలువురి హృదయాలను కదిలించివేసిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య(46) అనే వ్యక్తికి కూతురు (18) ఉంది. గట్టయ్య కూతురు ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమను తండ్రి గట్టయ్య అంగీకరించకపోవడంతో.... కూతురు ఇంట్లో నుండి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది.
కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తండ్రికి, కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పోలీసులు తెలిపారు. తన కూతురితో ఒక్కసారి మాట్లాడాలని అడగగా, కూతురు మాట్లాడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి గట్టయ్య తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కూతురికి ఫోన్ చేసి తండ్రి మరణ వార్త తెలపగా, తాను ముంబైలో ఉన్నానని తిరిగి రావడం కుదరదని కూతురు చెప్పడంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసిన కూడా కూతురు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెడుతున్నారు. వారి రోధన చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.