జంట హత్యలతో ఉప్పల్ నగరం ఉలిక్కిపడింది. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున తండ్రీ, కొడుకును దారుణంగా హత చేశారు.
ఉప్పల్ నగరంలోని హనుమసాయి కాలనీలో నరసింహమూర్తి(70) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నరసింహమూర్తిపై కత్తులతో విచక్షరహితంగా దాడి చేశారు. తండ్రి పై దాడి చేస్తుండగా కుమారుడు శ్రీనివాస్(35) అడ్డు రావడంతో ఇద్దరిని హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యను తమ బంధువులే చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఆస్తి తగాదాల వల్లే దాడి చేసి చంపేశారని అంటున్నారు. బ్లూ టీ షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపుకు పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా విడిపోయి సమీపంలోని కాలనీలు, పలు ప్రదేశాల్లో గాలింపు చేపట్టారు.