వాషింగ్ మెషిన్ నీటి వివాదం.. వివాహిత దారుణ హ‌త్య‌

Father and Son killed a married woman in Kadiri.వాషింగ్ మెషిన్ నుంచి వ‌చ్చే వృథా నీరు విష‌యంలో ప‌క్కంటి వారితో గొడ‌వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 10:45 AM IST
వాషింగ్ మెషిన్ నీటి వివాదం.. వివాహిత దారుణ హ‌త్య‌

వాషింగ్ మెషిన్ నుంచి వ‌చ్చే వృథా నీరు విష‌యంలో ప‌క్కింటి వారితో గొడ‌వ ఓ వివాహిత హ‌త్య‌కు దారి తీసింది. ఈ దారుణ ఘ‌ట‌న శ్రీస‌త్య‌సాయి జిల్లా క‌దిరిలో చోటు చేసుకుంది.

క‌దిరి ప‌ట్ట‌ణంలోని మాషానంపేట‌లో మ‌నోహ‌ర్‌, ప‌ద్మావ‌తి(34) దంప‌తులు త‌మ ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. మ‌నోహ‌ర్ డ్యాన్స్ అకాడ‌మీని నిర్వ‌హిస్తూ త‌న కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగా మంగ‌ళ‌వారం ఉద‌యం కూడా అకాడ‌మీకి వెళ్లాడు. ప‌ద్మావ‌తి బ‌ట్ట‌లు ఉతికేందుకు వాషింగ్ మెషిన్‌ను ఇంటి ఎదుట ఉంచి అందులో బ‌ట్ట‌లు వేసింది.

వాషింగ్ మెషిన్ నుంచి వ‌చ్చే మురికి నీరు త‌మ ఇంటి ముందుకు వ‌స్తున్నాయ‌ని పొరుగున నివ‌సించే వేమ‌న్న నాయ‌క్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఈ విష‌యంలో ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేమ‌న్న నాయ‌క్‌, అత‌డి కుమారుడు ప్ర‌కాష్ నాయ‌క్ లు ప‌ద్మావ‌తిపై రాళ్ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌ద్మావతి తీవ్రంగా గాయ‌ప‌డింది. వెంట‌నే స్థానికులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం బెంగ‌ళూరుకు త‌ర‌లిస్తుండ‌గా మృతి చెందింది. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story