కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటకలోని హల్లిఖేడ్ వద్ద ఓ వ్యాను, కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) మరికొందరితో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గాణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం ముగించుకుని కారులో తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో హల్లిఖేడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కారులోని మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.